Songs Library

పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్న

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల……. అన్న పాటను శ్రీ గోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు. ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు, సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను చేకూర్చి చెప్పే విషయం శ్రోతకు చాలా సూటిగా చేరేలా చేస్తాయి.

మానవతా విలువలకు, స్వావలంబనకు ఆలవాలంగా ఉండే పల్లెలు నేడు సామ్రాజ్యవాద విస్తరణ ఫలితంగా తన స్వతంత్రతను, స్వచ్చతను కోల్పోయి, ఎవరిపై ఆధారపడకుండా ఇంతవరకూ బ్రతికిన తనబిడ్డలు వృత్తులు కోల్పోవటంతో పరాయి పంచన బతుకుతుండటాన్ని చూస్తూ ఈ విశాల భారత దేశంలోని ఒక పల్లె కన్నీరు పెడుతుంది, అంటూ గొప్ప ఎత్తుగడతో ఈ పాట మొదలౌతుంది. బహుళ జాతి కంపనీల విస్తరణను, సామ్రాజ్యవాదాన్ని ఈ కవి ఇక్కడ కనిపించని కుట్రలుగా వర్ణిస్తాడు. చేతి వృత్తుల చేతులిరిగిపోవటం వల్ల గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసి పోయిందని బాధపడతాడు.

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

లోహ పాత్రల ఇంద్రజాలంతో కుండల వాడకం మాయమైపోయింది. కుమ్మరి వాళ్ళు మట్టి పిసుక్కునే వామిలో తుమ్మలు మొలిచాయి, అని అనటం ద్వారా వారు పని లేక చాలా కాలంగా ఉంటున్నారన్న విషయాన్ని కవి చాలా కరుణ ఉట్టిపడేలా చెపుతాడు.
నాగళ్ళ ఆరులు, కొడవల్ల కక్కులు, బండి వరలు, చేసే కమ్మరికి పనిలేక కొలిమిలో దుమ్ముపేరుకొంది పెద్ద బాడిస మొద్దుబారింది అనటంలో ఆ కులం ప్రస్తుతం అనుభవిస్తున్న దైన్యం కళ్ల ముందు నిలుస్తుంది. సాలెల మగ్గం కీళ్ళు విరిగి మూలకూర్చున్నదట. ఉపాధి మూలకూర్చున్నప్పుడు ఆత్మాభిమానం కల కుటుంబ పెద్దకు ఆత్మహత్య మినహా మరో మార్గం కనిపించకపోవటం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి.

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతు
బావులెందుకెండే నా పల్లెల్లోనా

పల్లెలకు ప్రధాన ఆధారం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంలో పెద్ద చిన్న రైతుల మధ్య తేడా ఈ పాదంలో చూడవచ్చును. బలిసిన దొరల పెద్దబోరు పొద్దంతా నీటిని భూమిలోతుల్లోంచి తోడుతున్నప్పుడు, చిన్నరైతు సేద్యానికుపయోగపడే బావులు, వాగులు వంకలు, మడుగులు తమ కళను కోల్పోయాయట. వీటిపైనే ఆధారపడే చాకలివానికి కూడా గడ్డుకాలమొచ్చింది అని కవి చెపుతున్నాడు. ఆ వాక్యంలో కూలిపోయినవి అన్న ఒక్క పదంద్వారా ఎంతటి విషాదాన్ని కవి పలికించాడో గమనించవచ్చు.

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పల్లెల్లో ఆటవిడుపుకోసం సేవించే కల్లుల స్థానంలో కల్తీకల్లు, బీర్లు, విస్కీలు, పెప్సీలు వచ్చిచేరాయి అనటంలో స్థానిక వనరుల విస్మరణ, కంపెనీల విస్తరణ, బలిసిన దొరలకే ధనం చేరుకోవటం వంటి విషయాల పట్ల కవి ఆవేదన చెందుతున్నాడు.

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

ఈ పాదంలో కవి సాయిబు పోరలని వర్ణించినా ఆ పోలికలన్నీ గ్రామాల్లో కాలువలలో, చెరువులలో, చేపలు, రొయ్యలు పట్టుకొని జీవనాన్ని సాగించే పల్లీయులకు కూడా వర్తిస్తుంది. రొయ్యల, చేపల పెంపకం, పెద్ద పెద్ద మరబోట్లతో ఫిషింగ్ రంగాల్లోకి బడా స్వాములు కాలూనటంతో, ఈ పల్లీయులు కూడా చాలా చోట్ల ఉపాధి కోల్పోయి చెల్లా చెదురైనారు. తల్లికీ, ఊరికీ దూరంగా ఉన్న ఆ పోరలు తమ ఆకలి రొట్టెముక్కలతో తీర్చుకొన్నారా అయ్యో! వాటితో వారాకలి తీరిందా అని ప్రశ్నించడం, మూలాలు మరువని కవి, తడిని కోల్పోని మనిషి మాత్రమే చేయగలడు.

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

పల్లెల్లో వ్యవసాయాధారిత మరో కులం వడ్రంగి కులం. వీరు నాగళ్లు, బళ్లు చేస్తూ జీవిస్తూంటారు. పల్లే బావురుమంటున్నప్పుడు వీరికి పల్లెల్లో పని లేక ఫర్నీచరు పనులు, తాపీ పనులను వెతుక్కుంటూ పట్నాలకు వలసపోయారన్న విషయాన్ని కవి చెపుతున్నాడు.
ఆ సామూలంతా కూసూనేటి అన్న వాక్యంలో పోతులూరి వీరబ్రహ్మం పోలిక తీసుకు రావటం కవికి వారిపై కల అభిమానంగా అనుకోవచ్చు. వాకిలి పొక్కిలి లేసిందనటంలో గొప్ప పదచిత్రాన్ని గమనించవచ్చును.

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

పల్లెల్లో టైలర్ పాత్ర ఒకనాడు ఎలా ఉండేదో, పదిమందికి తలలో నాలుకలా ఎలా ఉండేవాడో వంశీ లేడిస్ టైలర్ సినిమాలో చూడవచ్చు (కామెడీ కోణాన్ని పక్కనపెట్టి). అలాంటి టైలర్ ఈ రోజు రెడిమెడు దుస్తులు పల్లెల్లోకి కూడా చొచ్చుకు పోవటం వలన వాని పాత్ర కుచించుకుపోయింది. రెక్కల బనీన్లు, సోడెలాగులు (పిక్క లాగులు) ఇప్పుడు వాడేవారేరి? ఆ నేపధ్యంలో కుట్టుమిషన్ల చప్పుళ్ళు ఆగిపోయాయని కవి చెపుతున్నాడు.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ.

ఈ మద్య కాలంలో బయలు దేరిన ఒక విచిత్ర పరిణామమిది. చెన్నై బాంబేల నుంచి కంపనీ నగలను సేల్స్ వ్యక్తులు తీసుకువచ్చి, అమ్మి పెట్టమని స్థానిక వ్యాపారస్తులకప్పగించి, వాయిదాల పద్దతులలో డబ్బు వసూలు చేసుకుంటూంటారు. వాటిలో బంగారమెంతుంటుందో దేముడికే తెలియాలి. ఈ సేల్స్ వ్యక్తులు కూడా స్థానికంగా పాతుకుపోయిన డబ్బున్న వ్యాపారులనే తప్ప సామాన్య జీవనం గడిపే స్వర్ణ కారులను నమ్మరు. మరి అలాంటి నగలు చెర్నాకోలలై స్వర్ణకారులను తరుముతున్నప్పుడు, వీరు పల్లెల్ని విడిచి పట్నాలలో కూలిపనులు చేసుకొంటున్నారు. కొంతమంది పల్లెల్ని వీడలేక, కూలిపనులు చేయలేక వారు వృత్తిపరంగా ఉపయోగించే ద్రావకం లేదా సైనేడ్‌లను తాగి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఇక పట్నాలలో అయితే మరొక పద్దతి. Exchange Offer లతో పెద్ద పెద్ద షాపులు, “మీరీరోజు ఎంత బంగారమైతే కొంటారో, దాన్నిచ్చేసి అంతే బరువున్న మరొక వస్తువుని మీరెప్పుడైనా వచ్చి పట్టుకు వెళ్ళొచ్చు” అంటూ కొనుగోలుదారుడిని ఆకర్షిస్తూంటాయి.
ఇలాంటి పరిస్థితులలో, బంగారం తీసుకొని వారం తరువాత వస్తువిస్తాననే పేద కంసాలినెవరు నమ్ముతారు?
కూలిపోయిన స్వర్ణకారుల వృత్తిని కవి ఇక్కడ చాలా ఆర్ధ్రంగా ఆవిష్కరించాడు.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది.

కవి మాదిగ కులం ఎలాచితికి పోయిందో గొప్ప ప్రతీకలతో కళ్లముందు నిలుపుతున్నాడు. నోరుతెరవటం చావుకు చిహ్నం, భంగపడటం అవమానానికి, నిండమునగటం మరలా చావు / ఓటమికి చిహ్నం, పదునారిపోవటం పూర్వవైభవాన్ని కోల్పోవటం. బాటాలు, లోటోల దాడిలో ఆ వృత్తికి చెందిన వివిధ పరికరాలు పనుల్లేక ఏవిధంగా తల్లడిల్లుతున్నాయో అద్బుతమైన పదచిత్రాలతో కవి ఎంతో ఆర్ధ్రంగా చెప్పాడు.

పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

తోలు డప్పు స్థానంలో ప్లాస్టిక్కు డప్పు వచ్చి దాన్ని పాతరేసిందని చెప్పటం. పాతరేకు, పాతరేసి అన్న మాటలలో ధ్వని సౌందర్యం కంటే హింసాత్మక ముట్టడే ఎక్కువ వినిపిస్తుంది.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

అంటూ పూసలోళ్ల జీవనోపాధి ఏవిధంగా ఆవిరయ్యిందో కవి ఆవేదన చెందుతాడు.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

పల్లెటూర్లలో ఎద్దుబండి ఉన్నదంటే పాటలో చెప్పినట్ట్లు ఏడాదంతా పని దొరిదేది. అన్ని కాలాలలోనూ పనులుండేవి. ఇటుక, దాయ, పెంట తోలటం (ఇంటివద్ద పోగుపడిన పెంట అమ్ముకోవటం), అరకదున్నటం, ధాన్యం తోలటం, కుప్పనూర్పుళ్లు వంటివి. ఏ కాలానికి తగ్గ పనులు ఆ కాలంలో చేసుకుంటూ ఆ యజమాని తన కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొనేవాడు. కానీ టాటా ట్రాక్టరు వచ్చి దీన్ని గుద్దితే ఈ బండి ఎగిరిపడ్డదట. ఆ పడ్డంలో ఒక కుటుంబం దాని క్రింద పడి చితికి పోయిందన్న విషయాన్ని కవి మన ముందుంచుతాడు.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ… అన్న ప్రశ్నకు పంటపొలాల మందుల గత్తర వాసన అని చెపుతూనే అప్పు రైతు మెడమీద కత్తై కూర్చుందిఅంటు రెంటికీ ఒక అవినాభావ సంబంధాన్ని చాలా అద్బుతంగా ఆవిష్కరిస్తారు. ఈ నేలపై ఆర్ధికంగా బలహీనమైన వారు బ్రతికే నెలవును కోల్పోతున్నారన్న సత్యాన్ని అద్భుతమైన ఉపమానంతో కవి ముడిపెడతాడు.

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…

…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

పల్లెల్లో పల్లవించే జానపద కళలు ఎలా అంతరించిపోయినయో కవి కన్నీరొలికించేలా ఇక్కడ వర్ణిస్తాడు. హార్మోనియం చెదలు పట్టిందట, యక్షగాన పంతులు ఉప్పరి పని చేసుకొంటున్నాడు, తమ కళకు పోషణ లభించక. బుడగ జంగాలు పాతబట్టలమ్ముకుంటున్నారట. ఎందుకంటే పల్లె మొత్తం దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ కళలకు ఆదరణ ఎక్కడ చూపించగలదు? పాత బట్టల మూటలమ్ముకొంటున్నారు అని చెప్పటం ద్వారా పల్లె దరిద్రాన్ని కూడా అన్యాపదేశంగా చెపుతున్నాడిక్కడ కవి.

పిండిలా వెన్నెల కురిసే వేళ రచ్చబండపై ఊరు ఊసులు… చెప్పుకొనే ఆ పాతరోజులు తలచుకొని, ప్రస్తుతం భోజనం చేసాకా ఒక్కడు కూడా బయట తిరగటం లేదేమిటబ్బా ఇదేమి చిత్రమో అంటూ ప్రశ్నించి, స్టార్ టీవీ సకిలిస్తా ఉంది, సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మా నాపల్లెల్లోకు అని సమాధానాన్ని ఇస్తారు.

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

బహుళ జాతి మాయలు, కుటీర పరిశ్రమలు పెట్టకపోవటం అంటూ కనిపించని కుట్రలను పాట చివరి పాదంలో కవి స్పష్టం చేస్తాడు. ఈ పరిస్థితులకు సూచ్య ప్రాయంగా పరిష్కారాన్ని కూడా సూచిస్తాడు కవి.

ఈ పాటలోని శభ్దసౌందర్యం ఈ పాటకు గొప్ప అందాన్నిస్తుంది. చిన్నచిన్న అచ్చ తెలుగు పదాలు పాటనిండా పరచుకొంటాయి. వింటున్నప్పుడు వీనులకు ఒక వింతైన అనుభూతిని మిగులుస్తాయి. కానీ ఈ పాటలోని పదాల వెనుకున్న వాస్తవం, దైన్యం, నిస్సహాయత అంతకు నూరురెట్లు ప్రకాశవంతంగా ఒక కరుణార్ధ్ర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ పాట వందేమాతరం శ్రీనివాస్ గొంతునుండి వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఆ గాన గంభీరతకు ఒళ్ళు జలదరిస్తుంది. (ఉదా: యాచకులు నా బుడగా జంగాలు అన్న చోట).

ఏ కాలంలోని కవైనా ఆయా కాలాల రాజకీయ ఆర్ధిక పరిస్థితులను, తన రాతల్లో ప్రతిబింబింప చేస్తాడు. ఆ వచ్చే మార్పులు మంచి వైపుకైతే సంబరపడిపోతాడు. అవి సగటు మానవజీవనానికి విఘాతం కలిగించేవైతే ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాటికి పరిష్కారాలు తన పరిధిలో ప్రతిపాదిస్తాడు. ఈ పాటలో శ్రీ గోరటి వెంకన్న గారు సరిగ్గా అదే చేసారు. మారుతున్న పరిస్థితులలో కూలిపోతున్న ఉపాధులు, నలిగిపోతున్న బ్రతుకుల గురించి వారి పరిశీలనలను ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. వారికి ఈ బ్లాగ్ముఖంగా వందనాలు తెలియచేసుకొంటున్నాను.

 

Telangana Development Forum - Canada. © Copyright 2014 Hosting by Setup More